జ్ఞాన దంతాలు అంటే ఏమిటి?

జ్ఞాన దంతాలు అంటే ఏమిటి?

  • సాధారణంగా 17 నుంచి 25 ఏళ్ల వయసులో, పెద్దయ్యాక వచ్చే దంతాలను ‘జ్ఞానదంతాలు’ అంటారు.

  • దవడ భాగంలో చివరన ఆహారాన్ని నమలడానికి వచ్చే పెద్ద దంతాల వరసలో ఇవి చివరివి.

  • నోటిలోని మిగతా 28 పళ్లు వచ్చాక ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తే, ఇవి కూడా నమలడానికి మిగతా దంతాల వలె ఉపయోగపడతాయి.

  • అయితే ఇవి ఆలస్యంగా రావడం వల్ల, అప్పటికే దంతాల పలువరసలో వీటికి తగినంత స్థలం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి.

జ్ఞాన దంతాల వల్ల వచ్చే సమస్యలు

  • చిగురును చీల్చుకురావడంతో ఆ ప్రదేశంలో నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రబారడం.

  • కొన్నిసార్లు చిగుర్ల నుంచి చీము స్రవించడం.

  • మెడ వద్ద ఉండే లింఫ్ గ్రంథుల వాపు మరియు నొప్పి కారణంగా జ్వరం రావడం.

  • చిగుర్లలో నొప్పి, వాపు, మంట వంటి కారణాలతో ఆహారం మింగడంలో ఇబ్బందులు.

జ్ఞాన దంతాల సమస్యలకు కారణాలు (ఇంపాక్షన్)

  • దంతాల అమరికకు ఉన్న స్థలం సరిపోయేంతగా లేకపోవడం. దవడ వరస సన్నగా ఉండటంతో జ్ఞానదంతానికి తగినంత స్థలం దొరకకపోవచ్చు.

  • జ్ఞానదంతం వచ్చే సమయానికి ఆ పక్కనే ఉన్న పన్నుకూ, ఈ మొలుస్తున్న పన్నుకూ మధ్యన ఏదైనా గట్టి జామగింజ లాంటి బయటి వస్తువు (ఫారిన్బాడీ) చిక్కుకుపోతే దాని దిశ మారవచ్చు.

  • ఇలా జ్ఞానదంతం సరిగా మొలవడానికి ఆస్కారం లేక, మిగతావాటితో సమన్వయం లేకుండా కాస్త అటు ఇటుగా మొలవడాన్ని ‘ఇంపాక్షన్’ అంటారు.

ఇంపాక్టెడ్ జ్ఞానదంతాల రకాలు

  • మెసియో యాంగ్యులార్ ఇంపాక్షన్: పలువరస ఉన్న దవడలో జ్ఞానదంతం కాస్త ముందువైపునకు తోసుకువస్తూ ఇబ్బంది కలిగిస్తుంది. ఈ తరహా సమస్య 44 శాతం మందిలో ఉంటుంది.

  • వర్టికల్ ఇంపాక్షన్: జ్ఞానదంతం దవడ నుంచి పూర్తిగా బయటికి రాకుండా, కొంతభాగం మాత్రమే పైకి వస్తుంది. ఇది దాదాపు 38 శాతం మందిలో కనిపిస్తుంది.

  • డిస్టో యాంగ్యులార్ ఇంపాక్షన్: జ్ఞానదంతం నోటిలో వెనకవైపునకు పెరుగుతుంటుంది. ఇది ఆరు శాతం మందిలో ఉంటుంది.

  • హారిజాంటల్ ఇంపాక్షన్: సాధారణంగా జ్ఞానదంతం దవడకు నిలువుగా (90 డిగ్రీల కోణంలో) రావాలి. అలా కాకుండా పూర్తిగా లోపలి వైపునకు పెరిగితే దాన్ని హారిజాంటల్ ఇంపాక్షన్ అంటారు. ఈ సమస్య మూడు శాతం మందిలో ఉంటుంది.

జ్ఞాన దంతం సరిగ్గా రానప్పుడు కలిగే దుష్పరిణామాలు

  • పళ్లు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం సరిగ్గా జరగక పన్ను పుచ్చిపోవడం, రంధ్రం పడటం, చిగురుకు నొప్పి రావడం, పుండు పడటం (యాబ్సెస్) జరగవచ్చు. దీనివల్ల నోటినుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

  • జ్ఞానదంతం నిలువుగా రాకుండా మిగతా వాటిని నొక్కుకుంటూ వస్తే, దంతాల వరస అడ్డదిడ్డంగా మారవచ్చు. దీన్నే క్రౌడింగ్ అంటారు.

  • ఇది చిగురును ఒరుసుకుంటూ, కోసుకుంటూ వచ్చినప్పుడు చిగుర్ల వ్యాధికి దారితీసే అవకాశముంది.

జ్ఞాన దంతాన్ని ఎప్పుడు తొలగించాలి?

  • జ్ఞానదంతం పూర్తిగా దవడ నుంచి బయటకు రాకుండా, కొద్దిగా మాత్రమే బయటకు వచ్చినప్పుడు.

  • నమలడానికీ, నోటి ఆరోగ్యానికీ ఇబ్బందిగా మారినప్పుడు.

  • అడ్డదిడ్డంగా పెరుగుతూ మిగతా పలువరసను దెబ్బతీస్తున్నప్పుడు, పక్కనున్న పంటి వేరు (రూట్)ను దెబ్బతీస్తున్నప్పుడు.

  • ‘ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్’ అనే నరాన్ని దెబ్బతీస్తూ, దానిపై ఒత్తిడి వల్ల ఒక్కోసారి పెరాలసిస్కు దారితీసే అవకాశమున్నప్పుడు.

  • చిగుర్లపై చీము పేరుకుపోయి చిగుర్ల కణజాలానికీ, దవడ ఎముకకూ నష్టం చేస్తున్నప్పుడు.

గమనిక: పైన పేర్కొన్న సందర్భాల్లో చిన్న శస్త్రచికిత్స సాయంతో దంతవైద్యులు జ్ఞానదంతాన్ని తొలగిస్తుంటారు. అయితే దంతం సక్రమంగా వస్తూ, దవడ చిగుర్లలో ఇరుక్కుపోతే… చిగురు పైభాగాన్ని కాస్త తొలగించి దానికి తగిన దారి కల్పించి మామూలుగా వచ్చేందుకు దోహదపడవచ్చు. కాబట్టి ప్రతిసారీ జ్ఞానదంతాల్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. కొన్నిసందర్భాల్లో జ్ఞానదంతం అంకురాన్ని (బడ్) ఉపయోగించి దంతం రాని చోట వచ్చేలా చేసేందుకు కూడా ఆస్కారం ఉంది.