బ్రక్సిజమ్ అంటే...?

డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి (సీనియర్ డెంటల్ సర్జన్), డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై. (సీనియర్ సైకియాట్రిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ సైకియాట్రీ డిపార్ట్మెంట్, ఎంజీఎం గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్) అందించిన వివరాల ప్రకారం 'బ్రక్సిజమ్' (Bruxism) గురించిన సమాచారం:

బ్రక్సిజమ్ అంటే...?

  • కొందరు పిల్లలు, అరుదుగా కొందరు పెద్దలు నిద్రలో పళ్లు కొరుక్కుంటుంటారు.

  • కోపం వచ్చినప్పుడు బిగబట్టినట్టుగానే దవడలు బిగబట్టి నిద్రలో పళ్లు నూరుతుంటారు.

  • ఈ కండిషన్ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు.

  • వాళ్లలోని తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగ్జెటీ వంటి పరిస్థితులే ఇందుకు కారణం.

  • దీన్ని కొంతవరకు ఓ స్లీప్ డిజార్డర్గా కూడా పరిగణిస్తుంటారు.

  • ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించాల్సిందే.

  • ఇది పెద్దగా అపాయకరమైన కండిషన్ కాదు. పిల్లల్ని డెంటల్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారి పళ్లను చూసి డాక్టర్లు గుర్తిస్తుంటారు.

లక్షణాలు

  • తలనొప్పి (ముఖ్యంగా ఉదయం వేళల్లో ముఖం కూడా నొప్పిగా ఉంటుంది).

  • చెవి నొప్పి.

  • దవడ కండరాల నొప్పులు.

  • కొందరిలో చెవిలో హోరుమనే శబ్దం (టినైటిస్).

  • నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం.

  • నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది.

రకాలు

  • అవేక్ బ్రక్సిజమ్: కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కొంత కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది, చికిత్స పెద్దగా అవసరం లేదు. కొందరిలో ఏదైనా విషయంపై తీక్షణంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు, దీనికీ చికిత్స అవసరం ఉండదు.

  • స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో పాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం.

రిస్క్ ఫ్యాక్టర్స్

  • పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జెటీ వంటి పరిస్థితులతో పాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగ్జెటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు బ్రక్సిజమ్ను ప్రేరేపిస్తాయి.

  • పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం.

  • పెద్దల్లో కొన్ని రకాల ఔషధాలు (ముఖ్యంగా యాంగ్జెటీని తగ్గించడం కోసం వాడే సెలక్టివ్ సెరిటోనిన్ రీ-అప్ టేక్ ఇన్హిబిటార్స్ – ఎస్ఎస్ఆర్ఎస్ అనే మందులు).

  • పెద్దవారిలో గురక రావడం (స్లీప్ ఆప్నియా) కారణంగా.

మేనేజ్మెంట్ / చికిత్స

  • బ్రక్సిజమ్ అనే కండిషన్ పిల్లల్లో ఎప్పుడో ఓసారి కనిపించడంగానీ లేదా అప్పుడప్పుడూ వస్తుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు.

  • కానీ పళ్లకు హాని కలిగించేదిగా ఉన్నప్పుడు తొలుత వారి పళ్లు దెబ్బతినకుండా పళ్ల డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరం.

  • స్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలికపాటి వ్యాయామాలు చేయించాలి.

  • ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది.

  • జీవనశైలి (లైఫ్ స్టైల్)లో మార్పులు చేసుకోవాలి (పెద్దలు మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడం వంటివి మానేయడం).

  • కొన్ని పరీక్షల తర్వాత యాంగ్జెటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే… యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగ్జెటీ మందులతో పాటు, పళ్లు కొరుక్కోకుండా ఉండేందుకు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలను ఇస్తారు.